మేడ్చల్‌లో నీటి కటకట

Nagaraju Gaddamidi
1 Min Read

మేడ్చల్ పట్టణంలో ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. వారం రోజులకు ఒకసారి అయినా నల్లా నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకపక్క ఎండలు ముదురుతుండగా మరోపక్క మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున మంచినీటి సరఫరాలో మార్పు రాకపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది.

కొందరు తమ కార్లు, బైకుల ద్వారా క్యాన్‌లలో నీళ్లు తెచ్చుకొని వాడుతున్నారు. కార్లు, బైకులు లేనివారు నడుచుకుంటూ వెళ్లి క్యాన్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని వాడుకుంటున్నారు. మేడ్చల్ పట్టణంలో గత కొద్ది రోజులుగా మంచి నీటి సమస్య ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకోకపోవడం వల్ల పట్టణ దాహార్తిని తీర్చేవారే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ పట్టణానికి సరిపడ మంచినీరు సరఫరా కాకపోవడం వల్ల మేడ్చల్ పట్టణంలో మంచినీటికి కటకట ఏర్పడింది. మేడ్చల్ పట్టణంలో దాదాపు 8 వేలకి పైగా నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇవే కాకుండా కేఎల్‌ఆర్‌లో దాదాపు 2 వేల నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కొన్ని కనెక్షన్లు అధికారికంగా అనుమతులు పొందగా మరికొన్ని కనెక్షన్లు ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి.

పట్టణానికి సరిపడా నీరు కావాలంటే 4 ఎం ఎల్ డి నీరు అవసరం. అయితే ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా మేడ్చల్ పట్టణానికి 1 ఎం ఎల్ డి నీరు మాత్రమే వస్తోంది. దీంతో పట్టణానికి కావాల్సిన మంచినీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో 1 ఎం ఎల్ డి కన్నా తక్కువ మోతాదులో కూడా నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. పై నుంచి మేడ్చల్ పట్టణానికి కావాల్సిన మేరకు మిషన్ భగీరథ నీటి సరఫరా అందకపోవడంతో పట్టణ ప్రజలకు సరిపడా మంచినీరు అందించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *